త్వరలో మానవ మేధస్సును మించిపోయే టెక్నాలజీ.. గూగుల్‌ ఏఐ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

  • రానున్న రోజుల్లో మనుషుల కంటే తెలివైన ఏఐ
  • గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు
  • భవిష్యత్తులో రోగాలన్నింటికీ ఏఐ పరిష్కారం
  • మనుషుల ఆయుష్షు పెరిగే అవకాశం
సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ నటించిన ‘రోబో’ సినిమాలో డైరెక్టర్‌ శంకర్‌ చూపించిన ‘చిట్టి’ రాజ్యమేలనుందా? అంటే అవును అంటున్నారు గూగుల్‌ ఏఐ చీఫ్ డెమిస్ హసాబిస్. మనుషుల కంటే తెలివైన రోబోలు రాబోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ వార్షిక ఈవెంట్ ఐఓ స్టేజీపై ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.

మానవ మేధస్సును మించిపోయే సాంకేతికత
ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ గురించి డెమిస్‌ కీలక విషయాలు పంచుకున్నారు. మానవ మేధస్సును మించిపోయే ఆ సాంకేతికత మనకు చాలా దగ్గర్లోనే ఉందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ప్రపంచంలోని అన్ని రకాల రోగాలను నయం చేసే లక్ష్యంతో దీనిని తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. మనమంతా ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ యుగం అంచున ఉన్నామని వివరించారు.

రోబోలే అసిస్టెంట్లు
భవిష్యత్తులో ఇంటర్నెట్ వాడకం ఎంత సులువుగా మారుతుందో డెమిస్‌ ఈ కార్యక్రమంలో డెమో చూపించారు. మన తరఫున ఆన్‌లైన్ షాపింగ్ చేయడం, పనులను ట్రాక్ చేయడం, పక్కనే కూర్చున్న అసిస్టెంట్‌లా వెబ్‌లో సమాచారాన్ని వెతకడం లాంటి పనులను ఏఐ ఈజీగా చేసేస్తుందన్నారు. ఈ ప్రోగ్రాంకు హాజరైనవాళ్లను ఈ ఫీచర్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఏజీఐ అంటే?
ప్రస్తుతం మనం వాడుతున్న చాట్‌బాట్స్, ఇమేజ్ జనరేటర్లు అన్నీ ఒక నిర్దిష్టమైన పనిని మాత్రమే చేయగలవు. కానీ ఏజీఐ అలా కాదు. ఇది మనుషుల లాగే ఆలోచిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకుంటుంది. ఎలాంటి పరిస్థితులకైనా అలవాటు పడుతుంది. కోడింగ్ రాయడం, కొత్త మందులను కనిపెట్టడం, బిజినెస్ డీల్స్ మాట్లాడటం, ఫిలాసఫీ చెప్పడం లాంటి పనులన్నీ ఒకే ఒక్క ఏఐ సిస్టమ్ చేస్తుందన్నమాట.

శాస్త్రవేత్తల అనుమానాలు
డెమిస్‌ మాటలపై టెక్ ప్రపంచంలో కొందరు అప్రమత్తత వ్యక్తం చేస్తున్నారు. అసలు మేధస్సుకు సరైన నిర్వచనం లేనప్పుడు ఏజీఐ వచ్చేసిందని ఎలా చెబుతామని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నిపుణులు ఇదంతా సిలికాన్ వ్యాలీ కంపెనీల మార్కెటింగ్ స్టంట్‌గా కొట్టిపారేస్తున్నారు. మనుషుల్లాగా ఆలోచించే శక్తి ఏఐకి రావడానికి మరో పది నుంచి పదిహేనేళ్ల సమయం పడుతుందని అంచనా వేశారు.

పెరగనున్న ఆయుష్షు
ఏఐ వల్ల వైద్య రంగంలో ఊహించని మార్పులు రాబోతున్నాయని డెమిస్‌ అన్నారు. మనుషులు ప్రాసెస్ చేయలేనంత వేగంగా ఏఐ బయాలజికల్ డేటాను విశ్లేషిస్తుందని వివరించారు. క్యాన్సర్ లాంటి కఠినమైన రోగాలకు మందులను వేగంగా కనిపెట్టడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. వృద్ధాప్యాన్ని కూడా ఒక జబ్బులా భావించి మనుషుల ఆయుష్షును పెంచే దిశగా పరిశోధనలు వేగవంతం కానున్నాయని వెల్లడించారు.

Demis Hassabis
Google AI
Artificial Intelligence
AGI
Artificial General Intelligence
AI Technology
Robot Chittti
Future Technology
AI in Healthcare
AI Chatbots

More Telugu News